* ఇక కూటమికి దబిడి దిబిడేనా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ ఇక నుంచి ప్రజాక్షేత్రంలో వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి 9 నెలలు గడువు ఇచ్చిన జగన్… ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇక నుంచి నిత్యం ప్రజల్లోనే గడిపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనంగా ఉండిపోయారు. అధికార పార్టీ వరుసగా అక్రమ కేసులతో అరెస్టుల పర్వం కొనసాగిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పార్టీ కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 12వ తేదీన వైసీపీ చేపట్టిన ఫీజు పోరు దీక్షలో ఆయన పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
ఈ సారి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ.. చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోని వైసీపీ నేతలు.. అటు అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు… స్పీకర్ ఎన్నికకు డుమ్మా కొట్టారు. అంతేకాదు స్పీకర్ ను చైర్ లో కూర్చోబెట్టే సాంప్రదాయానికి కూడా దూరంగా ఉన్నారు. ఇక వార్షిక బడ్జెట్ సమావేశాలకు హాజరైనా.. క్షణాల్లోనే మాయమైపోయారు. దీంతో వైసీపీ తీరుపై కూటమి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వడానికి స్పీకర్, కూటమి నేతలు అంగీకరించకపోవడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని వై.ఎస్.జగన్ నిర్ణయించారు. దీంతో తొలి పోరు.. ఈ నెల 12న ‘ఫీజు పోరు’తో మొదలవుతోంది. పిల్లల తరఫున, వారి తల్లిదండ్రుల తరఫున విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నవారు. ప్రతి జిల్లా కేంద్రంలో వైసీపీ తరఫున కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
కూటమి పాలనలో విద్య వ్యవస్థ మొత్తం నాశనమైందని, ఆఖరికి విద్యా దీవెన పథకాన్ని కూడా భ్రష్టుపట్టించారని వై.ఎస్.జగన్ ఆరోపించారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన జగన్… కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అబద్ధాలతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు… సూపర్ సిక్స్ లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ‘పెద్ద చదువులు చదువుతున్న పిల్లాడికి విద్యాదీవెన కింద ఏడాదికి రూ. 2,800 కోట్లు. అంటే క్వార్టర్‌కి దాదాపు రూ.700 కోట్లు. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోసం వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్‌లో మేము రూ.1100 కోట్లు ఇచ్చే వాళ్లం. అలా రెండింటికీ ఏటా రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబు గతేడాది రూ. 700 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టింది రూ.3200 కోట్లు. అదికాక ఈ ఏడాది మరో రూ. 3900 కోట్లు కావాలి. రెండూ కలిపితే పిల్లలకు రూ.7,100 కోట్లు కావాలి. అయితే బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 అంటే పిల్లలను వారి చదువులకు దూరం చేసే కుట్ర జరుగుతుంది’అని వైఎస్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పటికే ఆన్‌లైన్ కోసం ఎడెక్స్ చేసుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వారికి కట్టాల్సిన డబ్బులు కట్టక వారు వెళ్లిపోయారు. మరోవైపు విద్యాదీవెన ఇవ్వక ఇంజినీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితులొచ్చాయి. పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితులొచ్చాయి. వసతి దీవెన పూర్తిగా గాలికి వదిలేశారు’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
మొత్తం మీద జనంలోకి జగన్ వెళ్లడం ఖాయమని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ నిత్యం జనంలోనే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో అటు అసెంబ్లీలో జగన్ పై కూటమి నేతలు.. ప్రజా క్షేత్రంలో కూటమిపై జగన్ మాటల తూటాలు పేల్చుకోనున్నారు. ఇప్పటికే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. ఇక జగన్… జనంలోనే ఉంటే కూటమి ప్రభుత్వానికి దబిడిదిబిడి ఖాయమే.