* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన
హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు, సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఏడు దశాబ్దాలపాటు రాజీలేని పోరు సాగించిన యోధుడు మానం ఆంజనేయులు అని పలువురు వక్తలు అన్నారు. భారతదేశ సహకార రంగంలో నాలుగు దశాబ్దాలపాటు అద్వితీయ సేవలు అందించిన సుప్రసిద్ధ సహకారవేత్త, ఎపి స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, నాఫ్ కాబ్ మాజీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంఎల్ మానం ఆంజనేయులు అభినందన సభ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కూకట్ హౌసింగ్ బోర్డు పిఎన్ ఎంపైర్ ఘనంగా నిర్వహించారు. అభినందన సభకు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ చలసాని రఘవేంద్రరావు అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, నాఫ్కాబ్ తెలంగాణ ఫెడరేషన్ డైరక్టర్ వేమిరెడ్డి నరశింహారెడ్డి, ది సిటీజన్ కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్, హైదరాబాద్ పిఆర్ రంగరాజు, ది ఎపి మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ రమేష్ కుమార్ బంగ్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు, అగ్రసేన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ కెడియ, నవభారత్ కోఆపరేటివ్ బ్యాంకు రిటైర్డ్ ఎండి పొట్లూరి పాండురంగారావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, మాజీ ఎంఎల్ పి.జె.చంద్రశేఖర్ రావు, నవచేతన విజ్ఞాన సమితి కార్యదర్శి బిఎస్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎన్.మధుకర్, సిపిఐ సీనియర్ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ పి.ప్రేమ్ పావని, అభినందనసభ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.చంద్రశేఖర్, కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.
ఆంజనేయులు అనుభవం వృధాగా పోవద్దు : దాసరి శ్రీనివాసులు
దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ సుదీర్ఘకాలం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఆంజనేయులు గురించి ఆర్ కూడా ప్రముఖంగా చేప్పుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఆంజనేయులు అనుభవం వృధాగా పోవద్దని, ఆయన అనుభవాలతో పుస్తకం రాస్తానని అన్నారు. ఆయన జీవితంపై పిహెచ్ చేయాలని సూచించారు. రంగరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని కోఆపరేటివ్ బ్యాంకులు దేశంలోనే మూడవ స్థానంలో ఉన్నాయన్నారు. కోఆపరేటివ్ వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా ఆంజనేయులు పరిష్కరించేవారన్నారు.
30 ఏళ్లు ఎలాంటి మకిలి అంటకుండా పనిచేశారు : ఆర్.వి.రామారావు
ఆర్.వి.రామారావు మాట్లాడుతూ అమిత్ కలిసి పనిచేసిన ఆంజనేయులుకు ఆ స్వభావం రాలేదన్నారు. నిరాడంబర జీవితం గడిపారన్నారు. ఎవరి స్కూటర్ వచ్చిన దానిపై వెళ్లేవారని తెలిపారు. ఎటిఎంలు వచ్చాక బ్యాంకులలో సేవలు తగ్గాయని, కానీ విశాఖ కోఆపరేటివ్ బ్యాంకులో ఎప్పుడు చూసిన మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు కనిపిస్తారన్నారు. కోటి రూపాయలతో ప్రారంభమైన బ్యాంకు లావాదేవీలను రూ.7675 కోట్లకు పెంచారన్నారు. ఎలాంటి మకిలి అంటకుండా 30 ఏళ్లు పనిచేశారని ప్రశంసించారు. మంచిపనిచేసే ప్రతివాడు కమ్యూనిస్టే అని రామారావు పేర్కొన్నారు.
సహకారోద్యమ భీష్ముడు : నాఫ్కాబ్ డైరెక్టర్ వేమిరెడ్డి నరశింహారెడ్డి
వేమిరెడ్డి నరశింహారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారోద్యమానికి మానం ఆంజనేయులు ఒక నిర్వచనమని, సహకారోద్యమ భీష్ముడన్నారు. సహకార రంగంపై, సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నాయకుడని, ఆయన గురించి ఎలాంటి పరిచయం అవసరంలేదన్నారు. 1983లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పరిపాలన పగ్గాలు చేపట్టి, ఆ బ్యాంకు మార్గదర్శిగా మారారన్నారు. ఆయన కృషి, నాయకత్వం విశాఖ బ్యాంకును దక్షిణ భారతదేశంలోనే నేడు దిగ్విజయ సంస్థగా నిలబెట్టా యన్నారు. ఆయన సేవలు ఈ బ్యాంక్ పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ సహకార ఉద్యమం వరకు విస్తరించాయని చెప్పారు. ఆయనకు 2016లోనే ‘నవభారత రత్న’ పురస్కారం లభించిందని నరశింహారెడ్డి అన్నారు.
సహకార వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం : చలసాని రాఘవేంద్ర రావు
చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని అర్బన్ బ్యాంకులన్నిటినీ ఐక్యం చేస్తూ 1986లో రాష్ట్ర అసోసియేషన్ స్థాపించడం ద్వారా ఆనాడు ప్రభుత్వంపై, ప్రభుత్వాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సహకార వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. 1983లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఎన్నికైన అతి చిన్నదైన ఆ సంస్థ నేడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా అభివృద్ధి చెందడానిక ఆయన అనుసరించిన వ్యూహాలే కారణమన్నారు. సహకార వ్యవస్థ పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించారన్నారు. 40 ఏళ్లకు పైగా సహకార బ్యాంకింగ్ వ్యవస్థ, సహకార రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించారన్నారు.
సామాన్యుల అభ్యున్నతి కోసం శ్రమించారు : జె.వి. సత్యనారాణ మూర్తి
జె.వి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ విద్యార్ధి, కార్మిక ఉద్యమాలలో ఆంజనేయులు జీవితకాలం మొత్తం సామాన్యుల అభ్యున్నతి కోసం శ్రమించారని అన్నారు. విశాలాంధ్ర సబ్ ఎడిటర్ రిపోర్టర్ పనిచేశారన్నారు. ఎంఎల్ ప్రజాజీవితంలో అనేక సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. విశాఖలో హిందూస్థాన్ షిప్ కార్మిక సంఘాన్ని స్థాపించి, కార్మికుల హక్కుల కోసం శ్రమించారన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులకు ఈఎస్ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని పోరాడి సాధించారన్నారు. ఆంజనేయులు ప్రారంభించిన ఈ డిమాండ్ జాతీయ స్థాయిలో ఉద్యమం వచ్చిందన్నారు. వేలాదిమంది దళితులు, గంగిరెద్దుల వాళ్లకు ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.
ఆర్థిక అసమానతల నివారణకు సహకార వ్యవస్థే పరిష్కారం : మానం ఆంజనేయులు ఉద్ఘాటన
సహకార బ్యాంకులు సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం పనిచేయాలని, అలా చేస్తేనే వాటికి సార్థకత ఉంటుందని మానం ఆంజనేయులు అన్నారు. ఈ సమాజంలో మార్పు కోసం సహకారవాదులంతా మరింత చైతన్యంతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇది వ్యాపారం కాదని, దీనికి ఒక లక్ష్యం ఉందన్నారు. వ్యత్యాసాలను కొంతైనా తగ్గించాల్సిన బాధ్యత సహకార సంస్థలపై ఉందన్నారు. సోషలిజం, పెట్టుబడిదారీ విధానాల మధ్య సిద్ధాంత ఘర్షణ ఉన్నప్పటికీ, రెండు రకాల భావాలు కలిగిన దేశాలన్నింటిలో కూడా సహకార వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 2012లోనే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని నిర్వహించిందని, రెండోసారి 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. ప్రతి దేశంలోనూ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, వాటిని సహకార వ్యవస్థే కొంతైనా తగ్గిస్తుందని ఐక్యరాజ్య సమితి చెబుతోందన్నారు.
ప్రభుత్వ ఆర్థిక సహాయం ఆశించవద్దు…
ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం కావాలని అడిగినా, ఏ రూపంలో తీసుకున్నా సహకార సంస్థలు బతకవని, అలా చేస్తే స్వతంత్రంగా ఉండలేవని మానం ఆంజనేయులు అన్నారు. ఎప్పుడైనా ప్రభుత్వాలు, వాటి ఆర్థిక సహాయంపై ఆధారపడితే కోఆపరేటివ్ వ్యవస్థ మునిగిపోతుందని హెచ్చరించారు. ప్రభుత్వాలే సహకార వ్యవస్థపై ఆధారపడాల్సిందే గాని, పాలకుల ఆర్థిక సహాయంతో వ్యవస్థ బతకకూడదనే విధానాన్ని రూపొందించుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా సహకార సంస్థ ప్రభుత్వం వద్ద డబ్బులు పెడుతున్నాం తప్పితే, ఏనాడూ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందలేదన్నారు. దేశంలో ఎక్కడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బతకడంలేదని ఆంజనేయులు స్పష్టం చేశారు.