HomeEditorialEditorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

Published on

spot_img

– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.

మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక ఎగిరెగిరి తన్నినా కిమ్మనటం లేదనే సామెతను నిజం చేస్తున్నారా ? మనది కర్మభూమి అనుకుంటున్నాం గనుక తప్పదు ! పదేండ్ల క్రితం డాలరుతో మారకంలో రూపాయి విలువ పతనం గురించి నరేంద్రమోడీ మొదలు బిజెపి నేతలందరూ ఎన్ని మాట్లాడారు ! ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పతనమైనా పల్లెత్తు మాటల్లేవేమి ? రూపాయి పతనం, జిడిపి వృద్ధి రేటు పతనం, ఎగుమతుల్లో ఎదుగుదల పతనం ఇలా పదేండ్ల పాలనలో అవే ఎక్కువ. మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పినట్లుగా రూపాయి విలువ తగ్గటం మనకు మంచిదే అని కొంత మంది సమర్థిస్తారు. కొన్ని అంశాలలో వాస్తవమే, ఎగుమతిదార్లకు, విదేశాల నుంచి డబ్బు పంపేవారికి లబ్ది, దిగుమతిదార్లకు, తద్వారా జనాలందరికీ భారం. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్న లోకోక్తి తెలిసిందే. మన దేశంలో అదే జరుగుతోంది. మన కరెన్సీ పతనం కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తుండగా అత్యధికుల జేబులు గుల్లవుతున్నాయి. ఏటా వేల కోట్ల డాలర్లను విదేశాలకు సమర్పించుకుంటున్నాము. ఉదాహరణకు 202223లో రు.21,45,690, 202324లో రు.19,54,060 కోట్లు విదేశాలకు సమర్పించుకున్నాము. దీనిలో ఎక్కువ చైనాకే రు.6,73,0006,97,000 చొప్పునవెళ్లింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఈ భారం మొత్తాన్ని మన జనం మీద మోపారు. కార్పొరేట్లు లేదా ప్రభుత్వ కంపెనీలు లాభాలతో సహా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను వినియోగదారులనుంచే కదా వసూలు చేసేది.

కొందరు వర్ణిస్తున్నట్లుగా ముచ్చటగానో లేదా మరికొందరంటున్నట్లుగా దేశానికి మూడిగానీ మోడీ పాలనలో పదకొండో ఏడులో ఉంది. 2014లో ఒక వస్తువు ధర రు.106 ఉంటే ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా అదే ఇప్పుడు రు.156 పెట్టి కొనాల్సి వస్తోంది.ద్రవ్యోల్బణం సగటున 5.12శాతం పెరిగిన ఫలితమే. ఈ నిర్వాకం సంగతేమిటి ? ఈ మేరకు జనానికి రాబడి పెరుగుతోందా ? 2024 అక్టోబరులో పద్నాలుగు నెలల గరిష్టం 6.21శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. వినియోగదారులు కొనేటట్లు లేదు కడుపు నిండాతినేట్లు లేదు. అన్నదాతల పరిస్థితి ఏమిటి ? ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తున్నది, దేశమంతటా ఈ పంటలకు ముఖ్యమైన డిఏపి ఎరువుల కొరత, దాన్ని ఆసరా చేసుకొని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.యూరియాయేతర ఎరువుల కోసం రబీ తరుణంలో ఎరువుల సబ్సిడీ నిమిత్తం రు.24,474 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నట్లు, అది గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువ అని గొప్పగా కేంద్ర పెద్దలు చెప్పారు. డిఏపి మే నెలలో టన్ను దిగుబడి ధర 510 డాలర్లు ఉండగా నవంబరు మొదటి వారంలో 645కు పెరిగింది.అది రు.54,000కు సమానం. ఈ స్థితిలో కేంద్రం గరిష్ట ధరగా రు.27వేలు నిర్ణయించి సబ్సిడీగా రు.21.911గా ప్రకటించింది. కొరత ఏర్పడిన స్థితిలో మరో మూడున్నరవేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఏ వ్యాపారి 54వేలు చెల్లించి దిగుమతి చేసుకుంటాడు ? ఒకవేళ దిగుమతి చేస్తే అంత ధరలో రైతులు కొనుగోలు చేయగలరా ?

గతేడాది అక్టోబరు ఒకటి నాటికి 30లక్షల టన్నుల మేర నిల్వలుండగా ఈ ఏడాది 16లక్షలకు తగ్గింది. పోనీ దేశీయంగా ఉత్పత్తి పెరిగిందా అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు శాతం తగ్గింది. దిగుమతులను చూస్తే గతేడాది ఏప్రిల్‌సెప్టెంబరు మధ్య 34.5లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అది 19.6లక్షలకు పడిపోయింది. ఏడాదికి 100 నుంచి 110లక్షల టన్నులు అవసరం కాగా దీనిలో 60శాతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఇప్పటి వరకు దిగుమతులు సగం తగ్గటానికి కేంద్రం ఎరువుల మీద సబ్సిడీలో భారీ కోత విధించటమే అసలు కారణం. 202223లో రు.2.51లక్షల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్‌, 202324లో రు.1.88, 202425లో ఆ మొత్తాన్ని రు.1.64లక్షల కోట్లకు కోత పెట్టింది. యుపిఏ సర్కార్‌ 2010లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని మాత్రమే సబ్సిడీగా ఇస్తారు, దాన్ని విమర్శించిన నరేంద్రమోడీ తనదాకా వచ్చేసరికి దాన్నే అమలు జరిపారు. అయితే మధ్యలో అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరగటం, రైతాంగం ఏడాది పాటు ఢల్లీి శివార్లలో ఉద్యమించిన నేపధ్యంలో సబ్సిడీ మొత్తాన్ని పెంచారు. తిరిగి పైన పేర్కొన్న విధంగా కోత మొదలు పెట్టారు.ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలంటే సబ్సిడీలకు కోతపెట్టి ప్రభుత్వ ఖర్చు తగ్గించటానికి పూనుకున్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గటానికి దిగుమతి చేసుకొనే ఎరువులు, గ్యాస్‌ ధర తగ్గటమే అని కొందరు చెబుతున్నారు. అదే ప్రాతిపదిక అయితే అవసరాలకు అనుగుణంగా డిఏపి దిగుమతి చేసుకొని పంటలు పండేందుకు తోడ్పడాల్సిందిపోయి, ధరలు పెరిగాయనే పేరుతో దిగుమతులు ఎందుకు తగ్గించినట్లు ?

రూపాయి పతనం అన్నది ఆర్థిక స్థిరత్వం మీద పెద్ద ప్రభావం చూపుతుంది.అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది.యుపిఏ పాలన మీద ధ్వజమెత్తటానికి బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు దీన్ని ఒక అయుధంగా వాడుకున్నారు. రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త). మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది. పదేండ్ల తరువాత ఇప్పుడు 84.73కు దిగజారింది.అడిగేవారు లేక గానీ పైన చెప్పిన అంశాలన్నీ మోడీకి వర్తించవా ? ఈ దిగువ ఆయా సంవత్సరాలలో రూపాయి సగటు విలువ ఎలా ఉందో చూడవచ్చు. 2024 విలువను రాసిన సమయానికి ఉన్నదిగా పరిగణించాలి.
సంవత్సరం = రూ.విలువ
2014 = 62.33
2015 = 62.97
2016 = 66.46
2017 = 67.79
2018 = 70.09
2019 = 70.39
2020 = 76.38
2021 = 74.57
2022 = 81.35
2023 = 81.94
2024 = 83.47
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. యుపిఏ చివరి సంవత్సరాలలో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు కూడా పెరిగాయి. మోడీ పదవిలోకి రాగానే ముడి చమురు ధర బాగాపడిపోయి దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింది, ఆ సమయంలో వినియోగదారులకు ఆ మేరకు లబ్ది చేకూరకుండా వివిధ సెస్సులను భారీగా విధించి, పెద్ద మొత్తంలో కేంద్రం రాబడిని పొందింది. రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు పెరుగుతాయన్నది కూడా వాస్తవం కాదు. 2013లో మన ఎగుమతులు 472 బిలియన్‌ డాలర్లు కాగా 2023లో అవి 777 బి.డాలర్లకు పెరిగాయి. దీన్నే జిడిపిలో చూస్తే ఎందుకంటే దాన్ని పెంచిన ఘనత తమదే అని బిజెపి చెప్పుకొంటోంది గనుక25.43 నుంచి మధ్యలో 18.66శాతానికి పడిపోయినా 2023లో 21.89శాతంగా ఉంది. అంటే మొత్తంగా చూసినపుడు పతనం తప్ప పెరుగుదల లేదు. దిగుమతులు వినియోగదారులకు భారం కాకూడదు. వజ్రాలు, బంగారం వంటి వాటిని దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను విధించవచ్చు, ఇబ్బంది లేదు, కానీ ముడిచమురు దిగుమతుల మీదకూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాలను పిండుకుంటున్నాయి.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాదికి ఇప్పటికీ తేడాను చూద్దాం. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.
ఏడాది = డాలర్లు ——–ఏడాది = డాలర్లు
2013-14 =105.52 2014-15 = 84.16
2015-16 = 46.17 2016-17 = 47.56
2017-18 = 56.43 2018-19 = 69.88
2019-20 = 60.47 2020-21 = 44.82
2021-22 I 79.18 2022-23 = 93.15
2023-24 = 82.58

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ ధరలను బట్టే రాష్ట్రాలు వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. కేంద్రం ధర తగ్గిస్తే ఆ మేరకు రాష్ట్రాలూ తగ్గిస్తాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. 2024 ఆగస్టు ఒకటవ తేదీన ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 201920లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను, తదితరాల రాబడి మొత్తం రు.5,55,370 కోట్లు కాగా దీనిలో కేంద్ర వాటా రు.3,34,315 కోట్లు, ఈ మొత్తాలు 202324 తాత్కాలిక అంచనాలో పెరిగిన మొత్తం రు.7,51,156 కోట్లు కాగా కేంద్ర వాటా రు.4,32,394 కోట్లు ఉంది. ఇంత మొత్తం సంపాదిస్తున్న కేంద్రం ఉజ్వల గాస్‌ పధకం పేరుతో ఒక్కొక్క వినియోగదారుకు ఏడాదికి ఇస్తున్న సబ్సిడీ రు.1,114 కాగా ఇతర వినియోగదారులకు ఇస్తున్న మొత్తం రు.670 మాత్రమే. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023`24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. అదుపులేని రూపాయి పతనం,ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతూ నడ్డి విరుస్తున్నాయి. పదేండ్ల క్రితం మోడీ చెప్పిన అచ్చే దిన్‌ ( మంచి రోజులు ) బిజెపి మద్దతుదార్లకైనా వచ్చాయా ?

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : కాషాయ తాలిబన్ల దాష్టీకం : ఏ మతంలో ఎందరుండాలో, ఎందరు పిల్లలను కనాలో కూడా వారే నిర్ణయిస్తారా !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి...

More like this

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...