* నూతన ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం
* పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ
* ఫలితాలొచ్చి 9 రోజులైనా సీఎం అభ్యర్ధి అంశంపై ఆలస్యం
మహారాష్ట్ర సీఎం అభ్యర్ధిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, సీఎం పదవి ఎవరు చేపట్టాలన్న అంశం కారణంగా ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. దీనిపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించడంతో ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం ఇద్దరు పరిశీలకులను నియమించింది.
మహారాష్ట్ర బీజేపీ ఎల్పీ పరిశీలకులుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను ప్రకటించారు. వీరిద్దరూ ముంబయి వెళ్లి మహారాష్ట్ర నూతన ప్రభుత్వ ఏర్పాటును పర్యవేక్షించనున్నారు. మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైంది.
నూతన సీఎం బీజేపీ నుంచే వస్తారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఇప్పటికే తమ వైఖరి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ పేరును ప్రకటించడం లాంఛనం కానుంది.
గురువారం నాడు ప్రమాణస్వీకారోత్సం ఉంటుందని తెలుస్తోంది. ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దరేకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను ఇవాళ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయస్థాయి అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.