హృదయవిదారక ఘటన…పెళ్లయి ఆరు రోజులే… కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా మిగిలింది ఆ నవ వధువు. హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లిన నవ దంపతులపై ముష్కరుల ముకుమ్మడి దాడి పెను విషాదాన్ని నింపింది. ఉగ్రదాడిలో కోల్పోయిన భర్త చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న… నవ వధువును చూస్తే ఎవరికి కంటనీరు రాకుండా వుంటుంది. మృతుడు ఇటీవలే వివాహం చేసుకున్న నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, రోదిస్తున్నది ఆయన భార్య హిమాన్షి అని నేవీ అధికారులు తెలిపారు.
నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, స్కూల్ టీచర్ అయిన హిమాన్షిల వివాహం సరిగ్గా ఆరు రోజుల క్రితం ఏప్రిల్ 16న ముస్సోరీలో జరిగింది. ఏప్రిల్ 6న వీరి నిశ్చితార్థం జరిగింది. వాస్తవానికి వారు హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. కానీ, వీసా రావడానికి ఆలస్యం కావడంతో కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వెళ్లాలని అనుకున్నారు. శ్రీనగర్ చేరుకున్న 48 గంటల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.