HomeEditorialEditorial : బిజెపి శ్రీరంగ నీతులు-వంచన : ఆర్టికల్‌ 370 తీర్మానంపై కాశ్మీరు అసెంబ్లీలో అరాచకం...

Editorial : బిజెపి శ్రీరంగ నీతులు-వంచన : ఆర్టికల్‌ 370 తీర్మానంపై కాశ్మీరు అసెంబ్లీలో అరాచకం !

Published on

spot_img

– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.

చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎలా ప్రవర్తించాలో బోధలు చేసే బిజెపి తనదాకా వచ్చే సరికి ఎదుటి వారికే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్లు వ్యవహరిస్తున్నది.తాజాగా జమ్మూకాశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలో, అంతకు ముందు అది ప్రతిపక్షంగా ఉన్నచోట్ల తన సుభాషితాలను తానే తుంగలో తొక్కి వ్యవహరించింది. పార్లమెంటు రద్దు చేసిన ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ లను పునరుద్దరించాలని కోరుతూ తాజాగా 2024 నవంబరు ఆరవ తేదీన కాశ్మీరు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి బిజెపి సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తూ సభలో అరాచకానికి దిగటంతో మార్షల్స్‌ను దించి గెంటివేయించాల్సి వచ్చింది. ఆ తీర్మానం చట్టవిరుద్దం,దేశానికే వ్యతిరేకం, కాశ్మీరుకు వ్యతిరేకంగా కుట్ర అంటూ బిజెపి గుండెలు బాదుకుంటున్నది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా భాగస్వామి అయ్యారు. కాశ్మీరులో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారంటూ రెచ్చగొట్టారు. భారత రాజ్యాంగం తప్ప అంబేద్కర్‌ పేరుతో ఎలాంటి రాజ్యాంగం లేదు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, వాటి బండారాన్ని చూద్దాం.

‘‘ ఆర్టికల్‌ 370ని పునరుద్దరించాలని అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించటం చట్టవిరుద్దం ’’ అయితే పార్లమెంటులో దాన్ని రద్దు చేయటం కూడా అంతే కదా ! ఒక రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసే ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాల్సి ఉంది. ఆ రాజ్యాంగ ప్రక్రియను తుంగలో తొక్కి ఏకపక్షంగా పార్లమెంటులో రద్దు చేసినపుడు బిజెపి పెద్దలకు అంబేద్కర్‌ గుర్తుకు రాలేదు. సదరు ఆర్టికల్‌ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన 23 పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు రద్దు చట్టబద్దమే అని చెప్పింది కదా అని ఎవరైనా అనవచ్చు. పార్లమెంటుకు ఉన్న అధికారాల మేరకు అది తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమే అని కోర్టు చెప్పింది. పార్లమెంటు మాదిరే కాశ్మీరు అసెంబ్లీకి కూడా అధికారాలు ఉన్నాయా లేవా ? ఉన్నవి గనుకనే ఆ మేరకు మెజారిటీగా ఉన్న సభ్యులు రద్దు చేసిన దాన్ని పునరుద్దరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పునరుద్దరణ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు తప్ప అదేమీ అమల్లోకి రాలేదు, రద్దు చేసిన పార్లమెంటే దాన్ని పునరుద్దరించాల్సి ఉంటుంది. అసలు తీర్మానం చేయటమే చట్టవిరుద్ధం అని బిజెపి చెబితే సరిపోతుందా ? ఆ పార్టీ నందంటే నందంటే నంది పందంటే పంది అవుతుందా ? కావాలంటే ఆ తీర్మానాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు కోర్టేమి చెబుతుందో దేశానికి కూడా తెలుస్తుంది. ఆ పని చేయకుండా అసెంబ్లీలో అరాచకానికి పాల్పడటం ఏమిటి ? ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా మూకస్వామ్యంలోనా ?

తమకు అధికారమిస్తే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. అలాగే తమకు అధికారమిస్తే రద్దు చేసిన సదరు ఆర్టికల్‌ పునరుద్ధరణకు కృషి చేస్తామని కాశ్మీరులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, సిపిఎం భాగస్వాములుగా ఉన్న కూటమి కూడా ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు అధికారానికి వచ్చిన తరువాత దాన్ని తీర్మానరూపంలో నెరవేర్చింది. అధికారం రాకపోయినా రాష్ట్రంలో తమదే పెద్ద పార్టీ అని రాష్ట్ర బిజెపి నేతలు చెట్టుకింద ప్లీడర్లలా వాదిస్తున్నారు. పెద్ద పార్టీ తప్ప దానికి వచ్చింది నాలుగోవంతు ఓట్లే అన్నది గమనించాలి. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి, దాని మిత్రపక్షాలకు సీట్లు ఎక్కువ వచ్చాయి తప్ప ఓట్లు రాలేదు. దాన్ని వ్యతిరేకించే పార్టీలకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటపుడు ఆర్టికల్‌ 370ని రద్దు చేయకూడదు కదా, ఎందుకు చేసినట్లు ? 2019లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమికి వచ్చిన ఓట్లు 45.3శాతం కాగా, 2024 ఎన్నికల్లో 42.53శాతానికి పడిపోయాయి. ఇదే సమయంలో యుపిఏ లేదా ఇండియా కూటమి ఓట్లు 27.5 నుంచి 40.56శాతానికి పెరిగాయి. అన్నింటికంటే కాశ్మీరులో బిజెపి ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ ఓటర్ల ముందుకు వెళితే ఇండియా కూటమి మద్దతు కోరాయి. బిజెపికి వచ్చిన ఓట్లు కేవలం 25.63శాతమే, ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించే పార్టీలకే మిగిలిన ఓట్లన్నీ వచ్చాయి.బిజెపి చెప్పే అధిక ఓట్లు నేషనల్‌ కాన్ఫరెన్సుకు వచ్చిన ఓట్లతో పోల్చుకొని మాత్రమే. ఇండియా కూటమికి 36శాతం ఓట్లు వచ్చాయి.

ఆర్టికల్‌ 370ని పునరుద్దరించాలన్న తీర్మానం పెద్ద కుట్ర అంటున్నారు. ఆ తీర్మానం బహిరంగం, టీవీ చిత్రీకరణ మధ్య అసెంబ్లీ ఆమోదించింది, కుట్ర ఎలా అవుతుంది ? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ చెప్పినట్లు కాశ్మీరు మీద కుట్ర అయితే అది బహిరంగ కుట్ర. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరభ్యంతరంగా చర్య తీసుకోవచ్చు, ఒట్టి మాటలెందుకు ? తాను అధికారంలో ఉన్నంత వరకు కాశ్మీరులో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని, బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగమే నడుస్తుందని, ఏ శక్తీ ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురాలేదని మోడీ చెప్పారు. చరిత్రను చూసినపుడు ఈ ఆర్టికల్‌ను అంబేద్కర్‌ వంటి వారు వ్యతిరేకిస్తే సమర్ధించిన వారు అత్యధికులు ఉన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయం వెల్లడిరచే హక్కు ఉంది. రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్‌కు గౌరవం దక్కింది. అది రాజ్యాంగసభ ఉమ్మడి నిర్ణయం తప్ప వ్యక్తిగతం కాదు. ఆ మాటకు వస్తే అంబేద్కర్‌ వ్యతిరేకించిన అంశాలు అనేకం ఉన్నాయి. మనుస్మృతిని బహిరంగంగా తగులపెట్టారు. ఆయన జీవిత కాలంలోనే అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని, ఆర్టికల్‌ 370ని తగులబెట్టలేదే ! అంబేద్కర్‌ను పదే పదే ఉటంకించే బిజెపి ఆయన మాదిరి మనుస్మృతిని తగులబెట్టటం సంగతి అలా ఉంచి కనీసం దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించగలదా ? అంబేద్కర్‌ బాటలో ఎందుకు నడవటం లేదు ? ఆయన నిరసించిన మనుస్మృతిని రాజ్యాంగంలో చేర్చలేదంటూ నిరసించిన ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపులోని వారే బిజెపి నేతలు. నరేంద్రమోడీ నిక్కర్లు వేసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకు హాజరైన సంగతి తెలిసిందే. సదరు సంస్థ మోడీ చెప్పిన అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. జాతీయ పతాకాన్ని కూడా అది గుర్తించలేదు, గౌరవించలేదు. రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఖరారు చేసింది. తరువాత నాలుగు రోజులకు నవంబరు 30న ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో ఏమి రాసిందో తెలుసా ! ‘‘ కానీ మన రాజ్యాంగంలో పురాతన భారత్‌లో అద్వితీయమైన రాజ్యాంగ పరిణామం గురించిన ప్రస్తావన లేదు.మను చట్టాలు స్పార్టా లికర్‌గుస్‌( గ్రీసు లాయర్‌, క్రీస్తు పూర్వం 730లో మరణించాడు) లేదా పర్షియా సోలోన్‌( క్రీస్తు పూర్వం 630560 మధ్య జీవించిన రాజనీతిజ్ఞుడు) కంటే ఎంతో ముందుగానే రాసినవి. మనుస్మృతిలో రాసిన చట్టాలు నేటికీ ప్రపంచ ప్రశంసలు పొందటం ఉద్వేగాన్ని కలిగిస్తున్నవి.కానీ మన రాజ్యాంగ పండితులకు మాత్రం వాటిలో ఏమీ కనిపించలేదు.’’ అని రాసింది. అంతేనా గురు ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ అనే గ్రంధం ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ఒక పవిత్ర గ్రంధం. దానిలో రాజ్యాంగం హిందూ వ్యతిరేకమైనదని రాశారు. వివిధ దేశాల నుంచి అంశాలను తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించారు తప్ప దానిలో మనది అని చెప్పుకొనేందుకు ఏమీ లేదు అంటూ అంబేద్కర్‌ను అవమానించేవిధంగా పేర్కొన్నారు.అలాంటి గోల్వాల్కర్‌ వారసులు ఇప్పుడు అంబేద్కర్‌ గురించి పొగడటం నిజంగా వంచన తప్ప మరొకటి కాదు. వారికి చిత్తశుద్ది ఉంటే గోల్వాల్కర్‌ రచనలు తప్పని బహిరంగంగా ప్రకటించాలి.

కాశ్మీరు అసెంబ్లీలో ఆర్టికల్‌ 370 పునరుద్దరణ తీర్మానాన్ని వ్యతిరేకించి సభలో అరాచకాన్ని సృష్టించిన బిజెపి మరోమారు ఆ అంశాన్ని చర్చకు తెచ్చింది. దాన్ని రద్దు చేసిన ఐదు సంవత్సరాల తరువాత ఎన్నికలు జరిపిన కేంద్ర ప్రభుత్వం(బిజెపి) ఊహించినదానికి భిన్నంగా అక్కడ తీర్పు వచ్చింది. దాన్ని మింగాకక్కలేక బిజెపి సభ్యులు ఐదు రోజుల పాటు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వాట్సాప్‌ యూనివర్సిటీ సమాచారం మీద ఆధారపడి వ్యవహరించకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా బిజెపి సభ్యులను తూర్పారబట్టారు. తమ అజెండాను నిర్ణయించేది రాష్ట్ర పౌరులు తప్ప వాట్సాప్‌ యూనివర్సిటీ, ఫేస్‌బుక్‌ లేదా ఎక్స్‌ కాదన్నారు. భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా స్పీకర్‌ సమావేశాలను నిర్వహిస్తే తాము సమాంతరంగా సభ, ప్రభుత్వాన్ని కూడా నిర్వహిస్తామని బిజెపి నేత సునీల్‌ శర్మ చెప్పారు. తమ సభ్యులను మార్షల్స్‌తో గెంటివేయించినందున వెలుపల సమాంతరంగా సమావేశం జరిపినట్లు చెప్పుకున్నారు. దీన్ని తేలికగా తీసుకోరాదన్నారు. అదంతా మీడియాలో ప్రచారం కోసం తప్ప మరొకటి కాదు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకొనే ఎంపీలు ఆత్మశోధన చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారు.2024 జనవరిలో తాత్కాలిక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షాలు అడ్డుకొనే ప్రవర్తనతో వ్యవహరించాయని,అదొక అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇంకా చాలా సుభాషితాలు చెప్పారు.

అధికారంలో ఉన్నపుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నపుడు మరొక మాట మాట్లాడటంలో బిజెపి ఏ పార్టీకీ తీసిపోలేదు. దివంగత బిజెపి నేత అరుణ్‌ జెట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు 2011 జనవరిలో మాట్లాడుతూ ‘‘ పార్లమెంటు పని చర్చలు నిర్వహించటం.అయితే అనేక సందర్భాలలో ప్రభుత్వం సమస్యలను పట్టించుకోదు అలాంటి సందర్భాలలో పార్లమెంటును అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే, కనుక పార్లమెంటులో అడ్డుకోవటం అప్రజాస్వామికం కాదు ’’ అని సెలవిచ్చారు. ఇప్పుడు అదే బిజెపి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రధాని సభకు రావాలని, కీలక అంశాలపై నోరు విప్పాలని కూడా పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ మాట్లాడుతూ ప్రతిపక్షంగా తమ విధి నిర్వహిస్తున్నాం తప్ప పార్లమెంటును అడ్డుకోవటం లేదని, ప్రధాని నరేంద్రమోడీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు పరిశోధనా సంస్థ పిఆర్‌ఎస్‌ విశ్లేషించినదాని ప్రకారం 2009 నుంచి 2014వరకు యుపిఏ పాలనా కాలంలో నిర్దేశిత సమయంలో లోక్‌సభలో 61శాతం, రాజ్యసభలో 66శాతం సమయం ప్రతిపక్షం ఆటంకాలతో వృధా అయింది. ఆ సమయంలో బిజెపి ప్రతిపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. తరువాత మోడీ తొలి ఏలుబడి 201419లో 16శాతం సమయం మాత్రమే ఆటంకాలతో వృధా అయింది.ఎవరు అడ్డగోలుగా వ్యవహరించారో, ఇతరులకు నీతులు ఎలా చెబుతున్నారో వంచనకు పాల్పడుతున్నారో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి.

Latest articles

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు.. మొసళ్లను గుర్తించిన అధికారులు

మధ్యప్రదేశ్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా మూడు మొసళ్లను గుర్తించిన అధికారులు...

Editorial : పదేండ్ల క్రితం వెలిగిన ప్రభ మసకబారింది, కెనడా ప్రధాని రాజీనామా !

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు...

Maoists : చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం

* జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోలు * ప్రాణాలు కోల్పోయిన 9 మంది జవాన్లు గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల...

Allu Arjun: అల్లు అర్జున్ కు భారీ ఊరట… రెగ్యులర్ బెయిల్ మంజూరు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన...

More like this

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు.. మొసళ్లను గుర్తించిన అధికారులు

మధ్యప్రదేశ్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా మూడు మొసళ్లను గుర్తించిన అధికారులు...

Editorial : పదేండ్ల క్రితం వెలిగిన ప్రభ మసకబారింది, కెనడా ప్రధాని రాజీనామా !

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు...

Maoists : చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం

* జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోలు * ప్రాణాలు కోల్పోయిన 9 మంది జవాన్లు గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల...