ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని…ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం.. ఇవాళ బలహీన పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.