అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా…ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న మహిళ (46) గురుగ్రామ్‌లోని ఓహోటల్‌లో బస చేశారు. ఈనెల 5న అక్కడ ఉన్న ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తుండగా కింద పడడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉంచారు. మరుసటి రోజున ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆమె.. భర్తకు జరిగిన విషయం చెప్పడంతో…ఇద్దరూ కలిసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.