జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది.
చెట్లను కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం… అనుమతులు తీసుకున్నారా? లేదా?
స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని.. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టేసినట్లయితే… సీఎస్ సహా… సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా సహించేదిలేదన్నారు.
రూ.పదివేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా.. అమ్ముకున్నారా..? అనేది తమకు అనవసరమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా..? లేదా..? అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి.. ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మనుసింఘ్వీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.