ఇటీవల యూపీలోని ఒక ఆస్పత్రిలో నవజాత శిశువు చోరీకి గురయ్యాడు. దీన్ని గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ శిశువును దుండగుడు విక్రయించాడు. నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా… ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
చిన్నారుల అక్రమరవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూరుచేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అక్రమ రవాణా పెండింగ్ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని… దేశవ్యాప్తంగా హైకోర్టులను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది. ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలి. రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలి…. అని ఆదేశాలు జారీ చేసింది.