మీ బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోలేకపోతే.. విడాకులు అవసరమే… అని మెలిందా అన్నారు. బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. విడిపోవడం అనేది కష్టమైన విషయమని.. ఆ సమయంలో ఎంతో భయానికి గురయ్యానని తెలిపారు. అయితే, ఆ తర్వాత తన జీవితం ఆనందంగా సాగిపోతోందని చెప్పారు. ‘సోర్స్ కోడ్’ పేరిట గేట్స్ ఇటీవల ఒక పుస్తకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెలిందాతో విడాకులు చాలా బాధాకరమైనవిగా గేట్స్ అభివర్ణించారు.
మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్‌గేట్స్ – మెలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు.
వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ జంట సుపరిచితం. విడిపోవడానికి దారితీసిన కారణాలను ఈ జంట ఇప్పటికీ చెప్పలేదు. అయితే, లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్ సంబంధాలు నచ్చని మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకుందని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ అప్పట్లో ఓ కథనంలో పేర్కొంది.