*’ధరణి’ ఎన్నో సమస్యలకు కారణమైంది..
*భూభారతి పోర్టల్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపే విధానానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.’భూభారతి’ పోర్టల్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘భూభారతి’ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి భూ చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలను సృష్టించి ధరణిని తీసుకువచ్చిందని ఆరోపించారు.
ఈ భూభారతి చట్టాన్ని 69 లక్షల మంది రైతుల కుటుంబాలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి రెవెన్యూ సిబ్బందిని ఎన్నో విధాలుగా అవమానించారని, వారిని ప్రజలను దోచుకునే వారిగా చిత్రీకరించారని విమర్శించారు. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేసిన రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం, అధికారులు వేర్వేరు కాదని గుర్తించాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి మనిషికి ఆధార్ వలె ప్రతి భూమికి భూధార్ తీసుకువస్తామని, ప్రతి భూమికి కచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూనే తిరిగాయని పేర్కొన్నారు. భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి భూస్వాముల నుంచి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని గుర్తు చేశారు. సేకరించిన మిగులు భూములను ఇందిరాగాంధీ ప్రభుత్వం పేద ప్రజలకు పంచిందని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు.