గత కొద్ది కాలం నుంచి….సెల్ఫ్ లవ్, ఆరోగ్యం, ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు నటి సమంత. నచ్చిన చిత్రాల్లో యాక్ట్ చేస్తూ తన అభిరుచులకు అనుగుణంగా జీవిస్తున్నారు. వ్యక్తిగత సంరక్షణ, మహిళా సాధికారిత వంటి అంశాలను ఉద్దేశించి తరచూ ఇన్‌స్టా వేదికగా సందేశాలు ఇస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యం, వాణిజ్య ప్రకటనలు వంటి అంశాలపై ఆమె చర్చించారు. ఇందులో భాగంగా ఇటీవల తాను ఎన్నో బ్రాండ్స్ వదులుకున్నట్లు చెప్పారు. రూ. కోట్లు వస్తున్నప్పటికీ వాటిని పక్కన పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందని తెలిపారు.
20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పట్లో… సక్సెస్‌కు నిర్వచనం చాలా విభిన్నంగా ఉండేది. మనం ఎన్ని ప్రాజెక్ట్‌లు చేశాం, ఎన్ని బ్రాండ్స్‌కు ప్రకటనకర్తగా ఉన్నామనే దానిపైనే విజయాన్ని నిర్ణయించేవారు. ఆ సమయంలో ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్స్‌కు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాను. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది కానీ… ఇప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకున్నాను . ఒకప్పుడు ఇష్టం వచ్చిన బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నందుకు నాకు నేనే క్షమాపణ చెబుతున్నాను . కోట్లలో డబ్బు ఇస్తానని వచ్చినప్పటికీ గడిచిన ఏడాదిలోనే సుమారు 15 బ్రాండ్స్ వదులుకున్నాను . ఇప్పటికీ నా వద్దకు ఎన్నో ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ఆఫర్స్ వస్తుంటాయి. కాకపోతే… వాటిని నేను వెంటనే అంగీకరించను. ఆయా ఉత్పత్తులను మొదట నాకు తెలిసిన ముగ్గురు వైద్యులతో పరిశీలించి.. అవి సమాజానికి ఎలాంటి హాని చేయవని నిర్ణయించుకున్నాకే వాటిని చేస్తున్నా…. అని సమంత వివరించారు.
తాను మయోసైటిస్‌తో ఇబ్బందిపడుతున్నానని కొంతకాలం క్రితం సమంత తెలియజేశారు. చికిత్స తీసుకుంటూనే… తాను సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్న రోజులు ఉన్నాయని చెప్పారు.