ఎన్నికలు లేనప్పటికీ… ముందు జాగ్రత్త కోసమో …ఏమో గానీ…సమాజంలో ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉంటరని తెలుసుకున్న ప్రతి రాజకీయ నాయకుడు బీసీ జపం అందుకుంటున్నారు . దేశంలో ఒకరి తర్వాత ఒకరు బీసీ జపం అందుకుంటునే… ఉన్నారు. నేనేం తక్కువ తినలేదన్నట్లు చంద్రబాబు కూడా తాజాగా బీసీ జపం అందుకున్నారు. టీడీపీకి మొదటి నుంచి వెన్నెముక బీసీ వర్గాలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో… బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు.
బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలు వచ్చాయి. విదేశాల్లో చదువుకునే వారికి రూ.15లక్షల సాయం అందిస్తున్నాం. సివిల్స్, గ్రూప్స్ రాసేవారికి అండగా ఉంటున్నామని తెలిపారు. అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. బ్యాచ్‌కు 500 మందికి చొప్పున శిక్షణ ఇస్తాం. ఆదరణ-3 కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం అని తెలిపారు.