వాతావరణ శాఖ చెప్పిన విధంగానే …..ఈ రోజు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొద్ది రోజుల నుండి ఎండ వేడిమితో అల్లాడిపోయిన నగర ప్రజలు చల్లని గాలులతో ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం నుంచే వాతావరణం చల్లబడగా.. తాజాగా సాయంత్రం వర్షం మొదలైంది. మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో… కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందే హెచ్చరించింది. హైదరాబాద్ ప్రాంతంలో … ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీచేసినట్లు తెలిపింది. రేపు (ఏప్రిల్ 11న) కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.