పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ను తప్పనిసరి చేశారు రవాణా శాఖ అధికారులు. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైతే…అది పాత వాహనంగా పరిగణించారు . వాటికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాలని తెలిపింది. ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే… ఇకపై ఈ నంబర్ ప్లేట్‌ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణాశాఖ సెప్టెంబరు 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో… రవాణాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతోంది. ఇప్పుడు పాత వాహనాలకూ దీన్ని తప్పనిసరి చేశారు.