ప్రముఖ కంపెనీల్లో వేల మంది ఉత్తరకొరియా వాసులు.. అమెరికా వారిలా నటిస్తూ ఉద్యోగాలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరు తప్పుడు ఐడీలతో ఈ ఉద్యోగాలు సంపాదించినట్లు గుర్తించారు. వీరి జీతం సొమ్ములో చాలా వరకు ప్రభుత్వ ఆయుధ తయారీకి వెళుతున్నట్లు అనుమానిస్తున్నారు. 2018 నుంచి వేల మంది ఈ రకంగా ఉద్యోగాల్లో చేరినట్లు అమెరికా విదేశాంగశాఖ, ట్రెజరీ విభాగం, ఎఫ్‌బీఐ సంయుక్తంగా అంచనా వేస్తున్నాయని ఫార్చ్యూన్ పత్రిక కథనంలో పేర్కొంది.
ఉత్తర కొరియా ఇంజినీర్లు.. అమెరికన్లమని చెప్పుకొంటూ దరఖాస్తు చేస్తున్నట్లు g8keep అనే క్రిప్టో స్టార్టప్‌కు చెందిన హారిసన్ లెగియో వెల్లడించారు. ఐరాస అంచనాల ప్రకారం ఉత్తర కొరియా ఐటీ వర్కర్స్… స్కామ్ రూపంలో 2018 నుంచి ఏటా ఆ దేశానికి 250 నుంచి 600 మిలియన్ డాలర్ల వరకు చేరుతున్నట్లు తేలింది. ఏఐ వినియోగంలోకి వచ్చాక ఉత్తరకొరియా వాసుల స్కామ్‌లు పెరిగిపోయినట్లు పేర్కొంది. కొందరు ఏకకాలంలో పలు ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తించారు. గూగుల్ క్లౌడ్‌లో ఇంటెలిజెన్స్ లీడర్‌గా పనిచేసే మిషెల్ బార్న్‌హార్ట్ కొన్నేళ్లుగా ఉత్తరకొరియా నుంచి వచ్చే ముప్పులను అధ్యయనం చేస్తున్నాడు. ఈ ఇంజినీర్లను చైనా, రష్యాలో ఉంచి ఏఐ సాయంతో ఓ మంచి కంపెనీలో అనుభవం ఉన్నట్లు బయో తయారు చేస్తారు. అప్పటికే దొంగతనం చేసి సిద్ధంగా ఉంచిన అమెరికన్ ఐడీలతో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తారు. వీరికి అమెరికాలో లేదా ఇతర ప్రాంతాల్లోని ఫెసిలిటేటర్లు సాయం చేస్తారు. కొందరు ఏకంగా డమ్మీ ఐటీ కంపెనీలు, వెబ్‌డిజైన్ ఏజెన్సీలను తెరుస్తారు. ఇవి నిజమైనవే అని నమ్మి ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా వారిని నియమించుకొంటున్నట్లు బార్న్‌హార్ట్ వెల్లడించారు.