అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల నేపధ్యంలో …చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యాయి. కానీ భారత్ మాత్రం విభిన్న ధోరణలు అవలంభిస్తుంది. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టిసారించింది. దీనిపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఎస్. జైశంకర్, మార్కో రూబియో తాజాగా ఫోన్‌లో చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి త్వరగా…. ఆమోదం తెలపాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ఇండో-పసిఫిక్, భారత ఉపఖండం, ఐరోపా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు సాగించాం. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ఏకాభిప్రాయానికి వచ్చాం. దీనిపై మరిన్ని సంప్రదింపులు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాం…అని జైశంకర్ రాసుకొచ్చారు.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడిన సంగతి తెలిసిందే. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునే దిశగా… దేశాధినేతలు అంగీకారం తెలిపారు. తాజా పరిణామాలతో త్వరలోనే ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి.