CRIME:యూ టర్న్ తో… జర్మన్ యువతిని ట్రాప్ లోకి
జర్మనీ యువతి అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మహ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పహాడీషరీఫ్ పోలీసుల తెలిపారు.
ఓ పార్టీ నేత కుమారుడైన అస్లాం మార్చి 31న రంజాన్ సందర్భంగా …సెల్ఫ్‌డ్రైవ్ కారు తీసుకుని తన కాలనీకి చెందిన బాలురతో నగరంలో తిరిగాడు. మందమల్లమ్మ చౌరస్తా దగ్గర అతడికి జర్మనీ యువతి, ఆమె స్నేహితుడు కనిపించారు. కారులో బాలురతో ఫ్యామిలీమ్యాన్‌లా నటిస్తూ వారిని పరిచయం చేసుకున్నాడు. వారిని కారు ఎక్కించుకొని మామిడిపల్లి గ్రామం సమీపానికి వెళ్లాక మైనర్ లను , యువతి స్నేహితుడిని కారు నుంచి దింపి సెల్ఫీలు తీసుకోవాలని చెప్పాడు. దగ్గరలో యూటర్న్ ఉందని… కారు తిప్పుకొస్తామని చెప్పి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నిందితుడిని ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది. నిందితుడి కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలు గురువారం జర్మనీ వెళ్లిపోనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంగళవారమే ఆమెను న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించారు. ఆమె స్నేహితుడి వాంగ్మూలం కూడా ఇప్పించారు. దీంతో ఈ కేసులో న్యాయమూర్తిని కూడా ఒక సాక్షిగా పరిగణిస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమయితే… వర్చువల్ గా బాధితురాలితో మాట్లాడిస్తారని అధికారులు తెలిపారు.