ముందుస్తు ప్రణాళికలతో శ్రీవారి సన్నిధికి వెళ్ళినప్పటికీ దర్శనం ఆలస్యం అవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.300 టికెట్ భక్తులకు మూడుగంటల్లోపు దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడి చెబుతుంది. కానీ నాలుగైదు గంటలకు పైగా సమయం పడుతుంది. వేసవి కాలం కావడంతో వృద్ధులు, చిన్నారులతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ప్రస్తుతం రూ.300 టికెట్లను రోజుకు 15 వేల వరకు విక్రయిస్తుండగా …. ఆన్‌లైన్‌లో 3 నెలలు ముందే బుక్ చేసుకుంటారు.
జనరల్ బ్రేక్, నైవేద్య విరామానంతర ప్రొటోకాల్ బ్రేక్, శ్రీవాణి దర్శనం, రెఫరల్ ప్రొటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగుతాయి. దీనికి మధ్యాహ్నం ఒకటి నుంచి ఒకటిన్నర వరకు సమయం పడుతోంది. దీంతో ఉదయం 9:30 స్లాట్ పొందిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనానికి కలిపి ఐదు నుంచి ఆరు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. సర్వదర్శనం టైమ్‌స్లాట్, ఎస్‌ఈడీ టికెట్లు ఉన్న భక్తులను ఏకకాలంలో క్యూలైన్లకు అనుమతిస్తుండటంతో మరికొంత ఆలస్యమై ఒక్కోసారి క్యూలైన్‌లోనూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వేసవి ఉక్కపోతతో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
టీటీడి అధికారులతో సీఎం చంద్రబాబు బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన చర్యల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైన దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో, ప్రపంచవ్యాప్తంగా హిందువులు అధికంగా ఉన్నచోట శ్రీవారి ఆలయాల నిర్మాణం వంటి వాటిపై ప్రణాళికలను సీఎం ముందుంచే అవకాశం ఉంది. అలిపిరి మార్గంలో వ్యాపార సంస్థలకు కేటాయించిన భూములు రద్దుచేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన చర్చించే అవకాశం ఉంది.